దేశంలో ప్రప్రథమంగా ప్రజా రవాణాలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టిన ఘనత నగరానికి దక్కనుంది. ఈ నెల 5 నుంచి ఇవి రోడ్డెక్కనున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో నగరానికి చేరిన 40 బస్సుల్లో మియాపూర్-2 డిపోకు 20, కంటోన్మెంట్ డిపోకు 20 బస్సులు కేటాయించారు. ఇప్పటికే నగర దారులపై ప్రయోగాత్మకంగా నడిపి పరిశీలించారు.
ఛార్జింగ్ ఇలా..
మియాపూర్, కంటోన్మెంట్ డిపోల్లో హైటెన్షన్ విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేసి 12 చొప్పున ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ఎప్పుడెప్పుడు..
ఈ నెల 5న తొలుత మియాపూర్-2 డిపోలో ప్రారంభించి వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి పరుగులు పెట్టిస్తారు. తర్వాత కంటోన్మెంట్ డిపో నుంచి ప్రారంభిస్తారు. అన్ని అందుబాటులోకి వస్తే ప్రతి 20 నుంచి 30 నిమిషాలకు విమానాశ్రయానికి వేర్వేరు ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేకతలు ఇవీ..
* కాలుష్యం తగ్గుతుంది. వైఫై, రేడియో, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఎల్‌ఈడీ దీపాలు, ఏసీ సౌకర్యాలుంటాయి. డ్రైవర్ సహా 40 మంది ప్రయాణించొచ్చు. దాదాపు 4-5 గంటలు రీఛార్జి చేయాలి. లిథియం ఐయాన్ బ్యాటరీని బస్సులో అమర్చడంతో ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్లు నడుస్తుంది. షార్ట్ సర్క్యూట్, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు అగ్ని ప్రమాదం జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఆర్టీసీకి ఆదా ఎంత.. రూ.2.5 కోట్ల వ్యయం అవుతున్న ఈ బస్సులకు ఒక్కోదానికి ఫేమ్(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చర్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకం కింద కేంద్రం రూ.కోటి సబ్సిడీ భరిస్తోంది. ఈ బస్సుల రాకతో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు ఏడాదికి రూ.40 కోట్ల వరకు ఆదా అవుతుంది.
No comments:
Post a Comment