కరెంట్ అఫైర్స్ 25 డిసెంబర్ 2019 Wednesday eenadunews
జాతీయ వార్తలు
జాతీయ జనాభా పట్టికకు రూ.3,941 కోట్లతో కసరత్తు. జనగణనకు రూ.8754 కోట్లు. కేంద్ర కేబినెట్ ఆమోదం. త్రిదళాధిపతి నియామకానికీ పచ్చజెండా :
i. జాతీయ పౌర పట్టిక (NRC)పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. జాతీయ జనాభా పట్టిక (NPR)లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించింది.
ii. దీంతోపాటు 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.12,700 కోట్లను కేటాయిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో జనగణనకు రూ.8,754.23 కోట్లు, ఎన్పీఆర్కు రూ.3,941.35 కోట్లను ఇవ్వాలని నిర్ణయించింది.
iii. జనాభా లెక్కల సేకరణ-2021లోని మొదటి దశతో పాటు ఎన్పీఆర్ను చేపడతామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. అయితే ఎన్ఆర్సీకి దీనితో సంబంధం లేదన్నారు. ఎన్పీఆర్ను అప్డేట్ చేసే సమయంలో ప్రజల నుంచి ఎలాంటి పత్రాన్ని కానీ బయోమెట్రిక్ డేటాను కానీ కోరబోమని చెప్పారు.
iv. ఎన్పీఆర్ ఉద్దేశం దేశంలోని ప్రతి నివాసితుడికి సంబంధించి సమగ్ర గుర్తింపు డేటాబేస్ను తయారుచేయడమని, అందులో బయోమెట్రిక్ వివరాలూ ఉంటాయని ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్’ అధికారిక వెబ్సైట్ పేర్కొనడం గమనార్హం.
v. 2010లో యూపీయే హయాంలో ఎన్పీఆర్ కసరత్తు మొదలయిందని జావడేకర్ చెప్పారు. సదరు పట్టికలో నమోదు చేసుకున్నవారికి కార్డులను పంపీణీ చేశారని తెలిపారు.
త్రివిధ దళాలకు ఉమ్మడి అధిపతి :
i. సైన్యం, నౌకాదళం, వాయుసేనకు కలిపి త్రివిధ దళాధిపతి పదవి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్-CDS)ని కొత్తగా సృష్టించడానికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.
ii. మూడు దళాల పక్షాన ప్రధాన మంత్రికి, రక్షణ మంత్రికి ఈ అధికారే ఏకైక సలహాదారుగా ఉంటారు. కీలక రక్షణ, వ్యూహాత్మక అంశాలపై సలహాలిస్తారు. రక్షణ మంత్రిత్వశాఖలో సీడీఎస్ అధ్యక్షతన సైనిక వ్యవహారాల శాఖ ఏర్పాటవుతుందని జావడేకర్ తెలిపారు.
iii. ఆ శాఖకు సీడీఎస్ కార్యదర్శిగా ఉంటారని చెప్పారు. ఆ అధికారికి ‘ఫోర్ స్టార్ జనరల్’ హోదా ఉంటుందని వివరించారు.
iv. 1999లో కార్గిల్ యుద్ధం అనంతరం దేశ భద్రతా వ్యవస్థలో లోపాలను గమనించేందుకు ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ ఈ పదవి ఏర్పాటును సిఫార్సు చేసింది.2012లో నరేశ్ చంద్ర నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ కూడా ఇదే సూచన చేసింది.
v. సీడీఎస్ పదవిని చేపట్టే అధికారి తన పదవీ విరమణ అనంతరం ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టరాదు. అనుమతి లేకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరకూడదు.
రైల్వేబోర్డు పునర్వ్యవస్థీకరణకు పచ్చజెండా :
i. రైల్వేబోర్డు పునర్వ్యవస్థీకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఛైర్మన్తో కలిసి బోర్డులో ఇకపై 8 మందికి బదులు ఐదుగురే ఉంటారు. ఆపరేషన్స్, వ్యాపారాభివృద్ధి, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు-ఆర్థిక వ్యవహారాలకు ఒక్కో సభ్యుడు ఉంటారు.ii. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్వదేశ్ దర్శన్ పథకం కింద అదనంగా రూ.1854.67 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం కింద దేశంలో కోస్తా సర్క్యూట్ సహా 15 పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయనున్నారు.
జాతీయ జనాభా పట్టిక (NPR) :
i. ఎన్పీఆర్ అనేది దేశంలోని సాధారణ నివాసితుల జాబితా. పౌరసత్వ చట్టం-1955, ‘పౌరసత్వ (పౌరుల నమోదు, జాతీయ గుర్తింపు కార్డుల మంజూరు) నిబంధనలు-2003’ కింద గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దాన్ని సిద్ధం చేస్తారు. దేశంలోని సాధారణ నివాసితులందరూ ఇందులో నమోదు చేసుకోవడం తప్పనిసరి.ii. దేశంలోని సాధారణ నివాసితులందరి సమగ్ర గుర్తింపు వివరాల(డేటాబేస్)ను తయారుచేయడం ఎన్పీఆర్ ఉద్దేశం. ఇందులో జనాభా సమాచారంతోపాటు బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.
iii. 2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2010లోనే ఎన్పీఆర్ కోసం డేటాను సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే ద్వారా దాన్ని అప్డేట్ చేశారు.
iv. ఎన్పీఆర్ డేటా ప్రజలకు బహిరంగంగా అందుబాటులో ఉండదు. అవసరమైన వ్యక్తులు పాస్వర్డ్ రక్షిత ప్రోటోకాల్ విధానాల్లో సమాచారాన్ని పొందవచ్చు. దేశ అంతర్గత భద్రతను మెరుగుపర్చేలా, సంక్షేమ పథకాల ప్రయోజనాలు వాస్తవ లబ్ధిదారులకు చేరేలా ఈ డేటాను ఉపయోగించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.
v. ఎన్పీఆర్, జన గణన వేర్వేరు. జన గణనను ప్రతి పదేళ్లకోసారి చేపడతారు. అక్షరాస్యత, పట్టణీకరణ, మతాలు, జనన మరణాలు, వలసల వంటి విస్తృత వివరాలు అందులో ఉంటాయి.
vi. పౌరసత్వ నిబంధనలు-2003’లోని 3వ నిబంధనలో ఉన్న 4వ ఉప నిబంధనకు అనుగుణంగా ఎన్పీఆర్ను అప్డేట్ చేస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. నిబంధన-3 భారత పౌరుల జాతీయ పట్టిక(ఎన్ఆర్ఐసీ)కు సంబంధించినది.
2024 కల్లా ఆకాశవాణిని పునర్వ్యవస్థీకరిస్తాం : జావడేకర్
i. డిజిటల్ రేడియోని 2024 కల్లా ప్రవేశపెట్టి ఆకాశవాణిని పునర్వ్యవస్థీకరిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.తెలంగాణ వార్తలు
పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి :
i. ఎన్నికలు జరుగుతున్న పురపాలకసంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, ఎన్నికలు జరగని పురపాలికలు, మున్సిపాలిటీలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కోడ్ వర్తించదని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి వెల్లడించారు.
ii. నగరపాలక సంస్థల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ. 1.5 లక్షలు. పురపాలక సంస్థల్లో ఎన్నికల వ్యయ పరిమితి లక్ష రూపాయలు.
iii. పురపాలక సంఘాల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే రూ. 1,250 ఇతరులు రూ. 2,500 డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
iv. నగరపాలక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ. 2,500, ఇతరులు రూ.5000 డిపాజిట్ చెల్లించాలి.
2020 కృత్రిమ మేధ(AI) సంవత్సరం : KTR
i. సమాచార సాంకేతికలో విప్లవాత్మకమైనదిగా గుర్తింపు పొందిన కృత్రిమ మేధ(AI - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ప్రత్యేక విధానం అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే దశాబ్దాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్వాగతం పలకనుంది.
ii. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ వచ్చే నెల రెండో తేదీన హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, నిపుణుల సమక్షంలో 2020ని కృత్రిమ మేధ సంవత్సరంగా అధికారికంగా ప్రకటించనున్నారు. అదే రోజు ప్రోత్సాహక విధానాన్ని విడుదల చేయనున్నారు.
iii. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్, బ్లాక్చైన్ సాంకేతికతలను వివిధ రంగాల్లో అమలు చేస్తోంది.
iv. కృత్రిమ మేధ, బిగ్ డేటా అనలిటిక్స్లు ఇప్పుడు సాంకేతిక రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి ద్వారా 2021 నాటికి భారతదేశంలో 8 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. నాస్కామ్ ద్వారా దీనిని అవలంభిస్తారు.
ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల వార్తలు
రోహ్తంగ్కు వాజ్పేయీ పేరు :
i. హిమాచల్ప్రదేశ్లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గంగా పరిగణించే రోహ్తంగ్కు ప్రభుత్వం దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పేరు పెట్టనుంది. ఆయన జయంతి (December 25)ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ii. వాజ్పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు 2000 సంవత్సరం జూన్ మూడోతేదీన రోహ్తంగ్ మార్గం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు.
29న సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణస్వీకారం :
i. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కలిసి కోరారు.
Defence News
మిగ్-27కు వీడ్కోలు పలకనున్న IAF :
i. భారత వైమానిక దళంలో(ఐఏఎఫ్)ని శక్తిమంతమైన మిగ్-27 యుద్ధవిమానం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో తన సత్తా చాటిన ఈ లోహ విహంగాలకు వాయుసేన శుక్రవారం వీడ్కోలు పలకనుంది.
ii. ఆ రోజున జోధ్పుర్ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్-27లు చివరిసారిగా గగనవిహారం చేస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడుతుంది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు. భారత వైమానిక దళంలో దీన్ని ‘బహుదుర్’గా వ్యవహరిస్తారు.
ఆర్థిక అంశాలు
ఏప్రిల్ 1కి విలీనం పూర్తి. ఒక్కటి కానున్న ఆంధ్రా బ్యాంకు, యూబీఐ, కార్పొరేషన్ బ్యాంకు :
i. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) లో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకుల విలీన ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తేదీ నాటికి పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ విలీనం తర్వాత యూనియన్ బ్యాంక్ దేశంలో ఐదో అతిపెద్ద బ్యాంకుగా నిలుస్తుంది.ii. అదనపు మూలధన నిధుల సమీకరణకు, రాని బాకీల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం కలుగుతుందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
iii. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రా బ్యాంకుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాల (ఆర్ఎస్ఈటీఐ) విభాగంలో ఉత్తమ పనితీరు సాధించిన బ్యాంకుగా అవార్డుకు ఎంపికైంది.
Persons in news
Uber co-founder Kalanick to leave company’s board :
i. Travis Kalanick, the co-founder of Uber, will resign from the board next week, the company announced. He was ousted as the CEO in 2017 with the company mired in numerous lawsuits.
Reports/Ranks/Records
ముకేశ్కు కలిసొచ్చిన 2019.ఏడాదిలో రూ.1.20 లక్షల కోట్లు పెరిగిన సంపద :
i. భారత శ్రీమంతుడు, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ మరోసారి తనకు పోటీలేదని నిరూపించారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం.
ii. బ్లూమ్బర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం.. డిసెంబరు 23కు ముకేశ్ నికర సంపద దాదాపు 61 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.27 లక్షల కోట్లు). ఇదే సమయంలో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా సంపద 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఆస్తి 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది.
iii. ప్రారంభించిన మూడేళ్లలోపే జియో.. భారత్లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించి సత్తా చాటింది. వచ్చే మూడేళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్ ఆదాయంలో 50% సమకూర్చనున్నాయి.
ముఖ్యమైన రోజులు
25 December : Good Governance Day (India) / సుపరిపాలన దినం (భారతదేశం)
i. అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 25 న భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం జరుపుకుంటారు, అతని సమాధి 'సాదియావ్ అటల్' దేశానికి అంకితం చేయబడింది.
ii. కవి, మానవతావాది, రాజనీతిజ్ఞుడు మరియు గొప్ప నాయకుడిగా అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అతను ఆగస్టు 16, 2018 న తన 93వ ఏట మరణించాడు.
iii. భారత ప్రజలలో పాలనలో జవాబుదారీతనం గురించి అవగాహన పెంచడానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళి అర్పించడానికి 2014 లో సుపరిపాలన దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
25 December - Christmas Day
i. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25 న క్రిస్మస్ రోజును జరుపుకుంటారు. క్రిస్మస్ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా, ప్రధానంగా డిసెంబరు 25న ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన, సాంస్కృతిక పండుగ.
ii. క్రీస్తు ఏ నెలలో, ఏ తేదీన జన్మించాడన్న విషయం తెలియకపోయినా, నాలుగవ శతాబ్ది మధ్యభాగం నాటికల్లా పశ్చిమ క్రైస్తవ చర్చి క్రిస్మస్ ను డిసెంబరు 25 నాటికి నిర్వహించడం సాగించింది, ఇదే తేదీని తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించింది. ప్రస్తుత కాలంలో క్రైస్తవుల్లో అత్యధికులు గ్రెగోరియన్ కేలండర్లోని డిసెంబరు నెల 25వ తేదీన నిర్వహించుకుంటున్నారు.
అటల్ బిహారీ వాజపేయి 95వ జయంతి : 1924 డిసెంబర్ 25
i. అటల్ బిహారీ వాజపేయి (1924 డిసెంబర్ 25 - 2018 ఆగస్టు 16) మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి.ii. ఇతను మొదటిసారిగా రెండవ లోక్సభకు ఎన్నికయ్యాడు. మధ్యలో 3వ, 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు.
iii. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశాడు.
iv. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించాడు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించాడు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నాడు.
v. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
vi. 2015 మార్చి 27 న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసాడు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజపేయి నివాసానికి తరలి వెళ్ళాడు.
vii. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
viii. వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు.
ix. వాజపేయి 1996 నుండి 2004 ల మధ్య మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. మే 1996లో వాజపేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపాయి ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశాడు.
x. 1996 నుండి 1998 ల మధ్యన రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత, లోక్సభ రద్దై, మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బి.జె.పి అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామైన, జయలలిత నాయకత్వంలోని ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏ.ఐ.ఏ.డి.ఎం.కె) పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17 లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక ఓటుతో ఓడిపోయింది.
xi. 1974 లో తొలిసారిగా "ప్రోఖ్రాన్-I" అణుపరీక్ష జరిపిన భారతదేశం, మళ్ళీ 24 సంవత్సరాల తరువాత, 1998 మే నెలలో భారతదేశం రాజస్థాన్ లోని పోఖ్రాన్ ఎడారిలో ఐదు భూగర్భ అణు పరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షను "ప్రోఖ్రాన్-II"గా వ్యవహరిస్తారు. వాజపేయి ప్రభుత్వం యేర్పడిన నెలరోజులలోనే ఈ పరీక్షలు జరిగినవి.
xii. 1988 చివరలో, 1999 మొదట్లో వాజపేయి పాకిస్తాన్తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్యచర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ-లాహోర్ బస్సును 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. కార్గిల్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ మధ్య మే - జూలై 1999 లో కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాలోను, మరికొన్ని సరిహద్దుల వద్దనూ జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు, కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్.ఒ.సి (వాస్తవాధీన రేఖ) దాటి భారతదేశంలోకి చొరబడడం.
xiii. కార్గిల్ పరిణామాల తరువాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్.డి.ఏ కూటమి లోక్సభ 303 స్థానాలు గెలిచి, భారత పార్లమెంటులో స్థిరమైన మెజారిటీని పొందింది. వాజపేయి 1999 అక్టోబరు 13 న మూడవసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించాడు.
అవార్డులు :
xiv. 1992 పద్మవిభూషణ్, 1994 లోకమాన్య తిలక్ పురస్కారం, 1994 ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 1994, భారతరత్న గోవింద్ వల్లభ్పంత్ అవార్డు, 2014 భారతరత్న.రచనలు :
xv. శక్తి సే శాంతి (1999), కుఛ్ లేఖ్ కుఛ్ భాషణ్ (1996), నేషనల్ ఇంటిగ్రేషన్ (1961), డైనమిక్ ఆఫ్ ఎన్ ఓపెన్ సొసైటీ (1977), బాక్ టు స్క్వైర్ వన్ (1998), డిసైసివ్ డేస్ (1999).
మదన్ మోహన్ మాలవ్యా 158వ జయంతి : డిసెంబర్ 25, 1861
i. మదన్ మోహన్ మాలవ్యా (డిసెంబర్ 25, 1861 - నవంబరు 12, 1946) భారతీయ విద్యావేత్త మరియు రాజకీయవేత్త. భారతీయ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సమరయోధుడు. ఆయన గౌరవంగా "పండిట్ మదన్ మోహన్ మాలవీయ"గా కూడా పిలువబడుతున్నారు. ఆయన "మహాత్మా"గా కూడా గౌవరింపబడ్డాడు.
ii. మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. ఈయన వారణాసిలో ఈ విశ్వవిద్యాలయాన్ని 1915 లో స్థాపించాడు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయం. ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లలో విద్యనభ్యసిస్తున్నారు. మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.
iii. మాలవ్యా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగు సార్లు (1909 & 1913,1919,1932) పనిచేశారు. ఆయన 1934లో కాంగ్రెస్ ను విడిచిపెట్టారు. ఆయన హిందూ మహాసభలో ముఖ్యమైన నాయకునిగా కూడా ఉన్నారు. మాలవ్యా "భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు"కు ఒక వ్యవస్థాపకుడు.
iv. ఆయన 1909 లో అలహాబాదు నుండి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక లీడర్ పత్రికను స్థాపించారు. ఆయన 1924 నుండి 1946 వరకు హిందూస్థాన్ టైమ్స్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన సేవలు 1936 లో హిందీ ఎడిషన్ ప్రారంభానికి ఉపయోగపడ్డాయి.
v. మాలవ్యా భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు అయిన భారతరత్నకు డిసెంబర్ 24,2014 న ఎంపికైనారు. ఈ అవార్డును ఆయన 125 వ జన్మదినం ముందుగా పొందారు. మాలవ్య 1861, డిసెంబర్ 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో జన్మించారు.
vi. బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు. 1922-23 లో హిందు మహాసభ అధ్యక్షుడుగా చేశారు
vii. "సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు.
జ్ఞాని జైల్ సింగ్ 25వ వర్ధంతి : 1994 డిసెంబరు 25
i. జ్ఞాని జైల్ సింగ్ పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ జిల్లాలో "సంధవాన్" అనే గ్రామంలో 1916 మే 5 న జన్మించాడు. జైల్ సింగ్ తండ్రి సర్దార్ కిషన్ సింగ్ మంచి దేశభక్తుడు. జైల్ సింగ్ సిక్కుమతానికి సంబంధించి చేసిన కృషి వలన "జ్ఞాని" అని గౌరవించబడ్డాడు.
ii. 1956 లో రాజ్యసభ సభ్యుడయ్యాడు. 1962 లో పంజాబ్ మంత్రివర్గంలో పనిచేసాడు. 1972 మార్చిలో పంజాబ్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి, పంజాబ్ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలన సాగించాడు.
iii. 1980 జనవరి లో జరిగిన ఎన్నికలలో హోషియాపూర్ నియోజకవర్గం నుండి లోక్ సభకు గెలిచి హోమ్ శాఖామంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. 15.07.1982 న రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. అదేనెల 25 వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
iv. అతని అధ్యక్ష పదవిని ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరా గాంధీ హత్య మరియు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు గుర్తించాయి. అతను 1994 లో కారు ప్రమాదం తరువాత గాయాలతో మరణించాడు.
మహమ్మద్ అలీ జిన్నా 143వ జయంతి : 1876 డిసెంబరు 25 (Quiad-e-Azam day in Pakistan)
i. మహమ్మద్ అలీ జిన్నా (1876 డిసెంబరు 25 – 1948 సెప్టెంబరు 11), 20వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు, భారత్ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు.
ii. ఇతడు షియా ముస్లిం. ముస్లిం లీగ్ నకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇతడికి పాకిస్తాన్ లో, కాయద్ ఎ ఆజం మరియు జాతి పిత Baba-e-Qaum అని పిలుస్తారు.
iii. జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రధానపాత్ర పోషించేవాడు, 1916 లక్నో ఒప్పందంలోనూ ముస్లింలీగ్ ను హిందూ-ముస్లింల ఐక్యత కొరకునూ పాటుపడ్డాడు. అంతేగాక అఖిలభారత హోంరూల్ లీగ్ లోనూ క్రియాశీలకంగా ఉన్నాడు.
iv. ఇతను రాజ్యాంగ సంస్కరణ ప్రణాళిక-పద్నాలుగు సూత్రాలు తయారుచేశాడు, దీని ప్రకారం ముస్లింల హక్కులు సంరక్షింపబడుతాయి. ముస్లింలీగ్ లోని అభిప్రాయభేదాలవలన ఈ ప్రతిపాదన సఫలం కాలేదు. దీనివలన జిన్నా దీర్ఘకాలం కొరకు లండన్ వెళ్ళిపోయాడు.
v. అనేక ముస్లిం నాయకులు, జిన్నాను బుజ్జగించి, 1934లో మరలా భారత్ను రప్పించుటలో సఫలీకృతులయ్యారు. భారత్ వచ్చిన జిన్నా ముస్లింలీగ్ ను ప్రక్షాళణా కార్యక్రమం చేపట్టాడు. లాహోర్ తీర్మానం ద్వారా తన "దేశ విభజన" కావాలి ముస్లింల కొరకు ప్రత్యేక దేశం కావాలి అనే పట్టును సాధించుకున్నాడు.
vi. 1946లో జరిగిన ఎన్నికలలో ముస్లింలీగ్ అనేక సీట్లను గెలుచుకున్నది. జిన్నా నేరు కార్యాచరణ ఉద్యమం చేపట్టాడు, ఈ ఉద్యమం ద్వారా పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందుటకు మార్గం సుగమమయింది. ఆంగ్లేయుల విభజించు-పాలించు సూత్రాన్ని అమలు పరచుటలో జిన్నా ఒక పావుగా మారాడు.
vii. ఇందుకు విరుద్దంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజాందోళనలకు దిగారు, దక్షిణాసియాలో హింస ప్రజ్వరిల్లినది. దేశాన్ని పాలించుటకు, కాంగ్రెస్-ముస్లింలీగ్ లు ఏకం కాలేదు, కనీసం ఏక సూత్రముపైనా రాలేదు. ఇదే అదనుగా బ్రిటిష్ ప్రభుత్వం భారత్-పాకిస్తాన్ లకు స్వతంత్రాన్ని ప్రకటించింది. స్వాతంత్ర్యం పొందిన ఇరుదేశాలలో కాందిశీకులు ఇరువైపులా ఎక్కువయ్యారు, వీరి గృహసౌకర్యాలను కల్పించడంలో తన సాధారణ పాత్రను అమలులో పెట్టాడు.
క్రీడలు
టెస్టులకు కోహ్లి, వన్డేలకు ధోని. క్రికెట్ ఆస్ట్రేలియా దశాబ్దపు జట్లకు కెప్టెన్లుగా ఎంపిక :
i. 2010-2019 మధ్య దశాబ్ద కాలానికి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించిన అత్యుత్తమ టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్లుగా విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యారు.
ii. గత పదేళ్లలో అత్యధిక టెస్టు విజయాలందుకున్న ప్రపంచ కెప్టెన్ కోహ్లీనే. భారత టెస్టు చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గానూ అతను నిలిచాడు.
iii. ఈ రెండు జట్లలోనూ పాకిస్థాన్, వెస్టిండీస్ ఆటగాళ్లెవ్వరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.
విరాట్ నం.1, బౌలర్ల ర్యాంకింగ్స్లో పాట్ కమ్మిన్స్ @ICC టెస్టు ర్యాంకింగ్స్ :
i. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నంబర్వన్ టెస్టు బ్యాట్స్మన్గా ఈ ఏడాదిని ముగిస్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్లో 928 పాయింట్లతో అతడు అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ (911) కంటే అతడు 17 పాయింట్లతో ఆధిక్యతతో ఉన్నాడు.
ii. కేన్ విలియమ్సన్ (864) మూడో స్థానంలో ఉన్నాడు. పుజారా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రహానె ఓ ర్యాంకును కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు.
iii. బౌలర్ల ర్యాంకింగ్స్లో బుమ్రా ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్ అగ్రస్థానంలో ఉన్నారు.
iv. టెస్ట్ ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా 2 వ స్థానంలో నిలిచాడు. వెస్టిండీస్ జాసన్ హోల్డర్ మొదటి స్థానంలో ఉన్నాడు.
v. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భారత్ 360 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (216) రెండో స్థానంలో, పాకిస్థాన్ (80) మూడో స్థానంలో ఉన్నాయి.
>>>>>>>>>>>>>>>> End of the day <<<<<<<<<<<<<<<<
No comments:
Post a Comment