✍ కరెంట్ అఫైర్స్ 5 నవంబరు 2019 Tuesday ✍
జాతీయ వార్తలు
డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి : NHAI ఛైర్మన్ సుఖ్‌భీర్ సింగ్ సంధూ
- జాతీయ రహదారులపై వాహనదారులు డిసెంబర్ 1 నుంచి తమ వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఏర్పాటు చేసుకోవటం తప్పనిసరి అని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సుఖ్‌భీర్ సింగ్ సంధూ స్పష్టం చేశారు.
- ఫాస్ట్‌ట్యాగ్ ఏర్పాటుతో వాహనదారులు టోల్ప్లాజా వద్ద నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా టోల్ ప్లాజాల్లో నగదు చెల్లింపులు లేకుండా ప్రయాణించవచ్చని తెలిపారు.
తెలంగాణ వార్తలు
హైకోర్టు ఏఎస్జీగా రాజేశ్వరరావు :
- తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా న్యాయవాది నామవరపు రాజేశ్వరరావు నియమితులయ్యారు. ఆయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
- మహబూబాబాద్ జిల్లా సూదన్‌పల్లికి చెందిన ఆయన 2001 నుంచి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.పలు ప్రభుత్వ విభాగాలకు ప్యానల్ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ. ప్రాధాన్యం లేని హెచ్ఆర్డీ సంస్థకు డైరెక్టర్గా ఎల్వీ సుబ్రమణ్యం :
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధికార యంత్రాంగంలో అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని అనూహ్యంగా బదిలీ చేసింది.
- ఆయన్ను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సదస్సులు
ఆర్సెప్లో చేరం. ఆ ఒప్పందంతో భారత్ ప్రజలపై ప్రతికూల ప్రభావం : బ్యాంకాక్ సదస్సులో మోదీ
- చైనా దన్నుతో ప్రతిపాదించిన 16 దేశాల ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య’ (ఆర్సెప్) కూటమిలో చేరబోవడం లేదని భారత్ విస్పష్టంగా ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ బ్యాంకాక్‌లో ఆర్‌సెప్ శిఖరాగ్ర సమావేశంలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.
- తాము లేవనెత్తిన కీలక అంశాలను అపరిష్కృతంగా వదిలేయడంతో భారీ వాణిజ్య ఒప్పందంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందం భారతీయులందరి జీవితాలపైనా, జీవనోపాధిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
- 2012లో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆర్‌సెప్ చర్చల్ని నేతలు మొదలు పెట్టారు. ఆధునిక, సమగ్ర, పరస్పర ప్రయోజనదాయక ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆసియాన్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద దేశాల మధ్య సాధించాలనేది వారి ఉద్దేశం.
- సురక్షితమైన నౌకాయానానికి సంబంధించి ‘తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు’’(EAS)ను వచ్చే ఏడాది చెన్నైలో నిర్వహించాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు.
- ఉగ్రవాదాన్ని, అంతర్జాతీయ నేరాలను అరికట్టడానికి మరింత ముమ్మరమైన ప్రయత్నాలు చేయాలని, ఐరాసలోని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశం ప్రతినబూనింది. బ్యాంకాక్లో జరిగిన 14వ సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు తీర్మానించింది.
- భారత్ ఎందుకు చేరలేదంటే..
- వాణిజ్య లోటు భర్తీని తీర్చడానికి, ధరల మధ్య వ్యత్యాసానికి తగిన పరిష్కారం కనిపించకపోవడం.
- దాదాపు 90% వస్తువులపై దిగుమతి సుంకాలను ఎత్తివేసేలా ఒప్పందం ఉండడం.
- వివిధ దేశాల నుంచి, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులు వెల్లువెత్తే ప్రమాదం
- అత్యంత ప్రాధాన్య దేశాల (ఎంఎఫ్ఎన్) హోదాను మరికొన్ని దేశాలకు ఇవ్వాల్సిన పరిస్థితులు రానుండడం.
- టారిఫ్ తగ్గింపులకు ప్రాతిపదిక ఏడాదిగా 2014ని పరిగణించాలనడం.
Art and Culture
కనకదాస జయంతి – November 5
- కనకదాస జయంతి సాధారణంగా కర్ణాటక ప్రజలు మరియు ముఖ్యంగా కురుబౌడ సమాజం జరుపుకునే పండుగ. ఇది ప్రతి సంవత్సరం గొప్ప కవి మరియు సాధువు శ్రీ కనక దాస జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు.
- గొప్ప సాధువుకు నివాళిగా కర్ణాటక ప్రభుత్వం కనక దాస పుట్టినరోజును రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మరియు కళాశాలలు కర్ణాటక గొప్ప సామాజిక సంస్కర్తలలో ఒకరికి నివాళిగా శ్రీ కనక దాస జన్మదినాన్ని జరుపుకుంటాయి. 525 వార్షికోత్సవం 2019లో జరుగనుంది.
సినిమా వార్తలు
అశుతోష్ గొవారికర్ తెరకెక్కిస్తున్న చారిత్రక చిత్రం ‘పానిపట్’ :
- ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అశుతోష్ గొవారికర్ తెరకెక్కిస్తున్న భారీ చారిత్రక చిత్రం ‘పానిపట్’. 1761లో జరిగిన మూడో పానిపట్ యుద్ధం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.
- ఆ యుద్ధంలో తలపడిన మరాఠా యోధుడు సదాశివ్‌రావ్ భావ్, ఆఫ్ఘనిస్తాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలి పాత్రల్లో అర్జున్ కపూర్, సంజయ్ దత్ నటించారు. సదాశివ్‌రావ్ భావ్ భార్య పార్వతీ బాయ్ పాత్రలో కృతి సనన్ కనిపించనుంది.
- కోరమీసం, తీక్షణమైన చూపులతో అర్జున్ కపూర్, గుబురు గడ్డం, క్రూరత్వం నిండిన కళ్లతో సంజయ్దత్, రాజసం నిండిన గెటప్పుతో కృతి లుక్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. డిసెంబరు 6న ఈ చిత్రం విడుదల కానుంది.
ముఖ్యమైన రోజులు
5 November : World Tsunami Awareness Day (ప్రపంచ సునామీ అవగాహన దినం)
- In 2019, World Tsunami Awareness Day promotes Target (d) of the "Sendai Seven Campaign," which focuses on reducing disaster damage to critical infrastructure and disruption of basic services.
- సునామీ ప్రమాదాలకు సంబంధించిన విషయాలలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. తరచుగా వినాశకరమైన సహజ ప్రమాదం నుండి నష్టాన్ని తగ్గించడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థల యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది.
- మొదటి ప్రపంచ సునామి అవగాహన దినోత్సవాన్ని 5 నవంబర్ 2016 న 'ప్రభావవంతమైన విద్య మరియు తరలింపు కసరత్తులు' (Effective Education and Evacuation Drills) అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.
India launches the Mars Orbiter Mission(MOM) , its first interplanetary probe – 5 November 2013
- అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళ్ యాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్. 2013 నవంబరు 5, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు.
- షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘అంగారక్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది.
- అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించిన మొట్టమొదటి దేశం భారతే.
- భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబరు 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్' బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు.
- 2014 సెప్టెంబరు 24 ఉదయం 7.17.32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పట్టింది.
చిత్తరంజన్ దాస్ జననం – 5 నవంబరు 1870
- దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ (C.R.Das) (నవంబరు 5, 1870 - జూన్ 16, 1925) ప్రముఖబెంగాళీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత.
- ఇంగ్లాండులో విద్యాభ్యాసము పూర్తి చేసుకొని, 1909లో అంతకు ముందు సంవత్సరములో జరిగిన అలీపూరు బాంబు కేసులో, అభియోగము మోపబడిన అరబిందో ఘోష్ ను విజయవంతముగా గెలిపించడముతో తన న్యాయవాద వృత్తికి శ్రీకారము చుట్టాడు.
- ఈయన 1919 నుండి 1922 వరకు కొనసాగిన సహాయనిరాకరణోద్యములో బెంగాల్ ప్రాంతములో ప్రముఖపాత్ర వహించి బ్రిటీష్ దుస్తులను బహిస్కరించడానికి నాంది పలికి ఐరోపా దేశ వస్త్రాలను తగుల బెట్టి స్వదేశ ఖాదీని కట్టి అందరికి ఆదర్శప్రాయుడయ్యాడు. తన మితవాదేతర అభిప్రాయాలు వ్యక్తపరచడానికి మోతీలాల్ నెహ్రూతో కలసి స్వరాజ్ పార్టీ స్థాపించాడు.
- బ్రిటిష్ రాజ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన "ఫార్వర్డ్" అనే పత్రికను స్థాపించి తర్వాత దాని పేరును "లిబర్టీ"గా మార్చారు. కలకత్తా కార్పోరేషన్ ఏర్పడ్డాకా దానికి ఆయన మొదటి మేయర్ గా పనిచేసారు.
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, గయ సెషన్స్ కు అధ్యక్షత వహించారు. ఆయన రాజకీయ జీవితం యావత్తు అనారోగ్యంతో బాధ పడినప్పటిక్, మొక్కవోని దీక్ష, పట్టుదలతో బ్రిటిష్ వారి పై పోరాడారు.
- ఆయన అహింసా విధానాన్ని నమ్ముతారు. స్వాతంత్ర్యాన్ని సాధించడానికి రాజ్యంగ బద్ధమైన విధానాలను అనుసరించాలని భావించేవారు. సమాజ సామరస్యానికి పాటు పడిన, జాతీయ విద్యాప్రగతి వాది. ఆయన వారసత్వాన్ని ఆయన శిష్యులు అనుసరించారు. వారిలో సుభాష్ చంద్ర బోస్ పేరెన్నికగన్నారు.
భూపేన్ హజారికా 8వ వర్ధంతి – 5 నవంబరు 2011
- భూపేన్ హజారికా (8 సెప్టెంబరు 1926 – 5 నవంబరు 2011) భారత దేశానికి చెందిన నేపధ్య గాయకుడు, గీతరచయిత, సంగీతకారుడు, గాయకుడు, కవి మరియు అసోం సినిమా నిర్మాత. అతను "సుధాకాంత" గా సుపరిచితుడు.
- ఆయనకు మరణానంతరం 2019 లో భారత అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత్ రత్న లభించింది.
- అతని పాడిన పాటలు ముఖ్యంగా అసోం భాషలో అతనిచే రచించబడ్డాయి. అతని పాటలు మానవత్వం మరియు విశ్వజనీన సహోదరత్వ భావాలు కలిగి అనేక భారతీయ భాషల్లో అనువదింపబడి, పాడబడ్డాయి.
- ముఖ్యంగా బెంగాళీ, హిందీ భాషల లోనికి అనువదించబడ్డాయి. అస్సాం, పశ్చిమబెంగాల్ మరియు బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల ప్రజల మధ్య సామూహిక, సామాజిక న్యాయం మరియు సానుభూతి నేపధ్యాలలో అతని పాటలు ప్రాచుర్యం పొందాయి.
- అస్సాం, ఉత్తర భారతదేశంలోని సంస్కృతి మరియు జానపద సంగీతాన్ని హిందీ సినిమాలో ప్రవేశపెట్టిన గుర్తింపు అతను పొందాడు. అతనిని 1975లో ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ ఫిలిం పురస్కారం, సంగీత నాటక అకాడమీ పురస్కారం (1987), పద్మశ్రీ (1977), మరియు పద్మభూషణపురస్కారాలు (2001) వచ్చాయి.
- అతనికి దాదాసాహెబ్ ఫాల్కేపురస్కారం (1992), సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (2008) లు కూడా లభించాయి. 2012లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ పురస్కారం పొందాడు. అతను డిసెంబరు 1996 నుండి డిసెంబరు 2003 వరకు సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా కూడా వ్యవహరించాడు.
క్రీడలు
హామిల్టన్.. ఆరోసారి ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్ టైటిల్ సొంతం :
- బ్రిటన్ రేసర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెజ్) మరోసారి ఎఫ్1 ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు.
- యుఎస్ గ్రాండ్ ప్రి రేసులో రెండో స్థానాన్ని దక్కించుకున్న అతను ఈ సీజన్‌లో అత్యధిక పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. మెర్సిడెజ్కే చెందిన మరో రేసర్ బొటాస్ యుఎస్ గ్రాండ్ ప్రి విజేతగా నిలిచాడు.
- హామిల్టన్ కెరీర్‌లో ఇది ఆరో ప్రపంచ టైటిల్. వరుసగా మూడోది. 2008లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన అతను.. 2014, 2015, 2017, 2018 సీజన్లలో టైటిళ్లు సొంతం చేసుకున్నాడు.
- దిగ్గజ రేసర్ మైకెల్ షుమాకర్ పేరిట ఉన్న అత్యధిక టైటిళ్ల రికార్డు (7)కు హామిల్టన్ ఒక్క టైటిల్ దూరంలో ఉన్నాడు.
- ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ ప్రతి ఏటా ఉంటుంది. సీజన్లో నిర్వహించే గ్రాండ్ ప్రి రేసుల్లో విజయాల ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు. గ్రాండ్ ప్రిలో ప్రదర్శనకు పాయింట్లు కేటాయిస్తారు.
No comments:
Post a Comment