Sunday, 10 February 2019

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 5 పథకాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా 5 పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజా వేదికలో ఎలక్ట్రానిక్‌ ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్‌ మందుల దుకాణాల ద్వారా మందుల విక్రయం, విజయనగరం, ఏలూరులలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల స్థాయి పెంపు, ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు కార్యక్రమం ఫిబ్రవరి 9న రాత్రి ఉండవల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చేతులమీదగా జరిగింది. ఎంపికచేసిన ఉప ఆరోగ్య కేంద్రాల్లో రోగులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంభాషించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ-సబ్‌ సెంటర్లను రాష్ట్రంలో ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రసవాలను ఉచితంగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఉద్దానంలో రానున్న పరిశోధన కేంద్రం ద్వారా రోగులకు మంచి జరుగుతుందన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో 50 పథకాలను వైద్య ఆరోగ్య శాఖ తరఫున చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
* రాష్ట్రంలోని ఉప ఆరోగ్య కేంద్రాలు ఎలక్ట్రానిక్‌ ఉప ఆరోగ్య కేంద్రాలు (ఈ-సబ్‌ సెంటర్‌)గా మారబోతున్నాయి. తొలుత విజయనగరం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో కలిపి 30 ఉప ఆరోగ్య కేంద్రాలను మార్చే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈ కేంద్రాల్లో టెలి మెడిసిన్‌ ద్వారా ఎంబీబీఎస్‌ అర్హత కలిగిన వారు (జిల్లా కేంద్రంలోని హబ్‌) ఓపీ సేవలను రోగులకు అందిస్తారు. చక్కెర వ్యాధి పరీక్షలు, ఈసీజీ వంటి పరీక్షలను ఈ కేంద్రాల్లో చేస్తారు. వైద్యులు సూచించిన మేరకు ఏఎన్‌ఎంలు రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తారు.
* ప్రైవేట్‌ మందుల దుకాణాల ద్వారా ఉచితంగా రక్తపోటు, చక్కెర వ్యాధి మందులను పంపిణీ చేస్తారు. ప్రభుత్వాసుపత్రులపై రోగుల ఒత్తిడి తగ్గించేందుకు ఇలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
* ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని 31 ఆస్పత్రుల్లో పడకలను రూ.250.96 కోట్లతో పెంచుతున్నారు. ముఖ్యంగా పాడేరు ఏరియా ఆస్పత్రిని 200 పడకలకు పెంచారు. నంద్యాల ఆస్పత్రిలో పడకలను 200 నుంచి 300కు పెంచనున్నారు. చంద్రగిరి మండలం కోట్ల గ్రామంలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం కాబోతుంది.
* విజయనగరం, ఏలూరులలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు వీలుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...