Friday, 8 March 2019

రఫేల్‌ పత్రాలు చోరీకి గురయ్యాయి

రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో ప్రభుత్వానికి క్లీన్‌ చిట్ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌.. రఫేల్‌ ఒప్పందం పత్రాలు చోరీకి గురయ్యాయని, దానిపై విచారణ జరుగుతున్నట్లు వెల్లడించారు.
రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను ఇటీవల ‘ద హిందూ’ పత్రిక ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావించిన కేకే వేణుగోపాల్‌.. ‘రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాలు ఇటీవల రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయి. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం.. ఇలాంటి పత్రాలు ఉంచుకోవడం నేరం. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. పత్రాల చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు వెల్లడించాలని ఆదేశించారు. 
అంతకుముందు సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపించారు. డిసెంబరు 14, 2018న రఫేల్‌పై ఇచ్చిన తీర్పులో చాలా తప్పిదాలు ఉన్నాయని, తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రఫేల్‌ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాలు చేస్తూ వచ్చిన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌, అరుణ్‌ శౌరీ కూడా ఉన్నారు. ఈ పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.  

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...