దేశంలోని పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ విషయంలో గోవా అద్భుత ఉదాహరణగా ఉందని పేర్కొంది.
దేశంలోని ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఫలితాలు దక్కేలా చూసేందుకు రాజ్యాంగంలోని 44వ అధికరణ ద్వారా రాజ్యాంగ నిర్మాతలు ఆశించినా ఇప్పటివరకూ ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. హిందూ చట్టాలను 1956లో క్రోడీకరించినప్పటికీ పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరగలేదు అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధా బోస్లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.
గోవా గతంలో పోర్చుగీసు వలసరాజ్యంగా ఉంది. అందువల్ల అక్కడ పోర్చుగీసు చట్టాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మూలాలున్న వ్యక్తికి గోవా వెలుపల ఉన్న ఆస్తుల వారసత్వం విషయంలో పోర్చుగీసు చట్టాలు వర్తిస్తాయా లేక వారసత్వ చట్టం వర్తిస్తుందా అన్న మీమాంశపై ధర్మాసనం పరిశీలన జరుపుతూ తాజా వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంలో పోర్చుగీసు పౌర స్మృతి-1867 మాత్రమే వర్తిస్తుందని తీర్పు చెప్పింది. దీనిపై భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించినందువల్లే పోర్చుగీసు పౌర స్మృతి గోవాలో అమలవుతోందని పేర్కొంది.
అందువల్ల ఆ చట్టానికి విదేశీ మూలాలున్నప్పటికీ అది భారత చట్టాల్లో భాగంగా మారింది అని పేర్కొంది.
No comments:
Post a Comment